అమరావతి: మురసు తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తెల్లవారుజామున 3:30 గంటలకు మరోసారి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై సమీక్షించారు.
ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద మురసు తుఫాన్ తెల్లవారుజామున 1 గంటకు తీరాన్ని తాకినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఉదయం 6:30 గంటల సమయానికి పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, రోడ్లపైకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్ల పరిస్థితిపై ఆరా తీశారు. ఇప్పటివరకు ఎక్కడా విద్యుత్ స్తంభాలు కూలిపోలేదని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడలేదని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్తి నష్టాన్ని కూడా సాధ్యమైనంత వరకు నివారించాలని సీఎం సూచించారు.
జిల్లాల వారీగా పరిస్థితి
బాపట్ల జిల్లా: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. రెండు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా వెంటనే తొలగించినట్లు వివరించారు. రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉందన్నారు.
నెల్లూరు జిల్లా: ఏడు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా వెంటనే తొలగించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
ఒంగోలు జిల్లా: ఐదు ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు సమాచారం అందడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు.
కృష్ణా జిల్లా: అవనిగడ్డ, నాగాయలంక తదితర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
గుంటూరు జిల్లా: అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైనప్పటికీ, విద్యుత్ స్తంభాలు లేదా చెట్లు కూలిన ఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా: వివిధ ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. బుడమేరు పరిధిలో పర్యటించామని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా కొన్ని కుటుంబాలను సురక్షిత శిబిరాలకు తరలించినట్లు వెల్లడించారు.
ఎన్నికల కౌంటింగ్‌కు కూడా ఏర్పాట్లు
తుఫాన్ సహాయక చర్యలు కొనసాగిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు.గత రాత్రి 10 గంటలకు కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాత్రి నుంచి ప్రతి గంటకూ అధికారుల నుంచి పరిస్థితులపైసమాచారంసేకరిస్తున్నారు.సోమవారం రోజంతా ఆర్టీజీఎస్ కేంద్రంలో ఉండి తుఫాన్ పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి, వివిధ శాఖల ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సమన్వయం చేస్తూ మొత్తం మూడు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.