అమరావతి:
అర్నబ్ తుపాను వేగంగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపాను బాహ్య వలయం ఇప్పటికే భూభాగాన్ని తాకుతున్నట్లు తెలిపింది. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తుపాను పూర్తిగా తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది.
గడిచిన ఆరు గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఈ అతి తీవ్ర తుపాను కదిలినట్లు అధికారులు తెలిపారు.
తీర ప్రాంతాలకు సమీపంలో తుపాను
తుపాను విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, కాకినాడకు 90 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 170 కిలోమీటర్లు, బాపట్లకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో రేపు ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించింది.
28 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి రాష్ట్రంలోని 28 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 133 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ వివరాలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.